* నీ శక్తిని నీవు తెలుసుకో, తెలుసుకోకుండా తొందరపడి వాగ్ధానం చేయకు. ప్రాణాలు విడువవలసిన స్థితి వచ్చినా యిచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకో.

ఒకరికి ఏదో చేస్తానని వాగ్ధానం చేయటం చాలా తేలిక. కాని ఆ మాట నిలబెట్టుకోవటంలోనే వుంది కష్టమంతా. అందుకనే ఇతరులకు వాగ్ధానం చేసేటప్పుడు ముందు తన సామర్ధ్యం ఎంత వరకు ఉందో తెలుసుకోవటం బుద్దిమంతుని లక్షణం. వాగ్ధానం వివేకంతో చేయాలి.

* గర్వమనేది మనిషి పతనానికి కారణం. ఇది అహంకారం వల్ల పుడుతుంది. గర్వం చిన్నా పెద్ద అనే తారతమ్యాన్ని గమనించనీయదు. దాని వల్ల కర్తవ్యం కుంటుపడుతుంది. ఇతరులనవమానించాలనే భావం పుడుతుంది. చివరికి అందరికీ దూరం కావాల్సి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలో కొండలాగా అడ్డుపడుతుంది. భగవద్దర్శనానికి యీ గర్వం బొత్తిగా పనికిరాదు. కంటికి పొర అడ్డం పడితే ఎలా వస్తువు కానరాదో మనిషికి ఈ గర్వం భగవత్తత్వ దర్శనం కాకుండా చేస్తుంది. గర్వం అంత శక్తివంతమైంది.

* ధర్మం ఆచరించాలంటే శరీరం ఆరోగ్యంగా తిన్నగావుండాలి. ఆరోగ్యంగా వుండేటట్లు కాపాడుకోవాలి. అందుకని శరీరానికి కావలసిన శక్తిని కలిగించటానికి ఆహార విహార నియమం పాటించాలి. అందుకనే ధర్మ నిర్వహణలో జాగ్రత్తగా శరీరధారణ చేయాలి. కనుక దానికనుగుణమైన ఉపవాసాదులు పాటించాలి. ఇదే మనసులో పెట్టుకొని "శరీర మాద్యంఖలు ధర్మ సాధనం" అన్నారు. శరీరమే లేకపోతే ధర్మ నిర్వహణ వుండదు కనుక అది ప్రధాన సాధనమైనది. మనిషి తన ధర్మ నిర్వహణకు శరీరాన్ని ప్రధాన సాధనంగా చేసుకొని లోకంలో ధర్మకర్మలాచరిస్తున్నాడు. దాని ఫలం ప్రజలు సుఖశాంతులతో వుండటం, పరమేశ్వరునికి ప్రీతి కలిగించటం. ఈ విధంగా తన దేహంతో పాటు లోకం కూడా రక్షింపబడుతోంది.

* మృదుత్వం, నిస్వార్ధ బుద్ధి మొదలయినవి శిష్యునిలో కలిగించటానికి గురువు ఒకప్పుడు వాటికి విపరీతంగా కాఠిన్యం, స్వార్ధగుణం మొ||వి తాను చూపిస్తాడు. ఎలాగంటే పాలు త్రాగే పసివాడి వ్యాధి తగ్గటానికి,తల్లి కషాయం త్రాగినట్లు. వినయం, స్వార్ధరాహిత్యం యీ రెండూ మంచి శిష్యుని లక్షణాలు. శిష్యుడికి వీటిల్లో ఏ గుణం లేకపోయినా గురువు కోపంతో మండిపోతునట్లు కనబడుతాడు. స్వార్ధపరునిగా ప్రవర్తిస్తాడు కాని, అంతరంగం లోపల శిష్యుని పట్ల సానుభూతి, వాత్సల్యం నిండుగా వుంటాయి. అయితే యీ విపరీత గుణాలు ప్రదర్శించటం కేవలం శిష్యుణ్ణి సన్మార్గంలో నడపటానికే. శిష్యుని విషయంలో గురువలా ప్రవర్తించినా తన కోపాన్నీ కాఠిన్యాన్ని సహించే శక్తిని శిష్యుడి కిస్తాడు. గురువేది చేసినా శిష్యుని శ్రేయస్సు కొరకే. పైకి గంభీరంగా కనపడినా అంతరంగం నిండా అమృతమే.

తల్లి వద్ద పాలు తాగే పిల్లవాడికి ఏ సుస్తే చేసినా తల్లే చేదు మందు తాగుతుంది. తల్లి పాల మీద ఆధారపడినవాడు కదా బిడ్డ! అలాగే గురువునే నమ్మి ఉన్న శిష్యుణ్ణి సరియైన మార్గంలో పెట్టడానికి గురువు చేసే చమత్కారమిది.

*స్వామీజీ చేసే చిద్విలాసంలో ఇదొకటి. శిష్యులకు భక్తులకు అనుభవమే*

* మనిషి గొప్ప తపస్సు చేసి విశ్వామిత్రుడంతటివాడు కావచ్చు, దానం చేసి కర్ణుడంతటి వాడు కావచ్చు, బాగా ధనరాసులు సంపాదించి కుబేరుడు కావచ్చు, గొప్ప అధికారంలో దేవేంద్రుడే కావచ్చు. అయిన ఒక్క సత్స్వభావం లేకపోయే సరికి ఈ గుణాలన్నీ పనికి మాలినవి అవుతాయి. సఛ్ఛీలం ఒక్కటి వుందనుకోండి ఈ గొప్పలన్నీ బాగా రాణిస్తాయి. సఛ్ఛీలం ఒక్కటివుంటే చాలు ఏవీ లేకపోయినా పరవాలేదు. ఒక్క సఛ్ఛీలానికి ఎంత ప్రాధాన్యముందో చూడండి. అది మనిషికి ప్రాణం వంటిది. ఎంత అందమైన శరీరమైనా సరే ప్రాణం పోయే సరికి దుర్గంధం కొట్టటం ప్రారంభిస్తుంది. అలాగే శీలం లేకపోయేసరికి ఎంత గొప్పవాడికయినా విలువ తగ్గిపోతుంది. కనుక అన్ని విధాలా శీలాన్ని కాపాడుకోవాలి.

"శీలం ~ మానవునికి అసలు సిసలయిన ఆభరణం"

సేకరణ ...శ్రీ గణపతి సచ్చిదానందుల వారి దివ్య సందేశాలు మరియు పుస్తకాల నుంచి